వివాహం ఎప్పుడు అనే ప్రశ్నకు రషీద్ ఆసక్తికర సమాధానం!

వాస్తవం ప్రతినిధి: అఫ్గానిస్థాన్ ప్రపంచకప్ గెలిచిన తర్వాతనే పెళ్లి చేసుకుంటానని ఆ దేశ యువ సంచలనం రషీద్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుత శకంలో అద్భుత బౌలర్‌గా కొనసాగుతున్న రషీద్.. పొట్టి ఫార్మాట్‌లో అనేక రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే టీ20 క్రికెట్‌లో 290 వికెట్లు పడగొట్టి తమ దేశం తరఫున ఈ ఘనతను అందుకున్న ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతీ టీ20 లీగ్ ఆడే రషీద్.. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ తరఫున ఆడుతూ భారత ప్రజల అభిమానాన్ని అందుకున్నాడు. అలాగే బిగ్ బాష్ లీగ్, ఎంజాన్సీ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లు కూడా ఆడాడు.

అఫ్గాన్ జట్టులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అయిన రషీద్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అని ఆజాది రేడియో ఇంటర్వ్యూలో అడగ్గా.. రషీద్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘అఫ్గానిస్థాన్ ప్రపంచకప్ గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటా’అని బదులిచ్చాడు.