ఐశ్వర్య రాయ్ బచ్చన్, బేబీ ఆరాధ్యకు కరోనా పాజిటివ్..!!

వాస్తవం ప్రతినిధి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అమితాబ్, అభిషేక్ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్, బేబీ ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఉదయం ఐశ్వర్య, ఆరాధ్యలకు తెమడ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చిందని ముంబయి నగర మేయర్ కిశోరి పెడ్నేకర్ తెలిపారు. అయితే, రెండో టెస్టులో వారిద్దరికీ పాజిటివ్ వచ్చిందని బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ వెల్లడించారు. జయా బచ్చన్‌కు మాత్రం నెగిటివ్ వచ్చిందన్నారు. బచ్చన్ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అమితాబ్ కుటుంబంలో పలువురికి కరోనా సోకడంతో వారి నివాస భవనం ‘జల్సా’ను బీఎంసీ అధికారులు మూతవేసి శానిటైజ్ చేశారు. ఇక బిగ్‌బీ ఫ్యామిలీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీనితో అమితాబ్ ఇంటి పరిసరాలను కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు.