‘బిగ్ బి’ ఫ్యామిలీలో కరోనా కల్లోలం.. తండ్రీకొడుకులిద్దరికీ కరోనా పాజిటివ్..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా.. ప్రస్తుతం ఈ పేరు కన్న డేంజర్స్ పదం మరోకటి లేదు. నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్టే ఉంది ఇప్పుడు కరోనా పరిస్థితి చూస్తుంటే. ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు. అవకాశం దొరికినవారికల్లా వ్యాప్తి చెందుతూ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. చిన్న-పెద్ద, కుల-మతం, సామాన్యుడు-సెలబ్రిటి ఇలా ఏ తేడా లేకుండా అందరి ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇప్పటికే పలు రంగాలకు చెందిన, పలువురు సెలబ్రిటిలు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డగా. తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కూ కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వారే ట్వీట్టర్ ద్వార వెల్లడించారు.

అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నా ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్‌కు తరలించారు. నా కుటుంబ సభ్యులు, స్టాఫ్ కూడా కోవిడ్ టెస్ట్ జరిపించుకోవాలని హస్పిటల్ వర్గాలు సూచించాయి. గత 10 రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ దయచేసి వారంతట వారే పరీక్షలు నిర్వహించుకోవాలని మనవి చేస్తున్నాను అని అమితాబ్ సూచించారు.

అమితాబ్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే అభిషేక్ బచ్చన్ సైతం తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు. ‘మా తండ్రి, నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మా ఇద్దరికీ కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరాం. సంబంధిత అధికారులందరికీ ఈ సమాచారాన్ని అందించాం. అలాగే మా కుటుంబ సభ్యులు, స్టాఫ్‌కు సైతం కరోనా పరీక్షలు చేయించాం. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేసారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనావైరస్ బారిన పడ్డారనే వార్త బయటకు రాగానే దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు షాక్ కి గురయ్యారు.