ఇంగ్లాండ్‌ లో భారత సంతతి వైద్యులకు అరుదైన గౌరవం!

వాస్తవం ప్రతినిధి: ప్రాణాలను పణంగాపెట్టి మహమ్మారితో పోరాడుతున్న ఇండియన్ డాక్టర్‌కు ఇంగ్లాండ్ లో అరుదైన గౌరవం దక్కింది. 117 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ పునఃప్రారంభమైన నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ వర్కర్ల సేవలకు సంఘీభావంగా వైద్యుల పేర్లతో ఉన్న జెర్సీలను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీమ్‌ ధరించింది. నలుగురు భారత సంతతి డాక్టర్ల పేర్లతో ఉన్న జెర్సీలను కూడా ఇంగ్లాండ్ క్రికెటర్లు ధరించడం విశేషం. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఇండియన్ డాక్టర్ వికాస్ కుమార్ పేరుతో కూడిన జెర్సీని ధరించి గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశాడు. దీనిపై డాక్టర్ వికాస్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకే కాకుండా ప్రతిఒక్క డాక్టర్‌కు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వికాస్ కుమార్ వ్యాఖ్యలపై బెన్ స్టోక్స్ స్పందించాడు. విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్నందుకు వికాస్ కుమార్‌కు స్టోక్స్ కృతజ్ఞతలు తెలిపాడు.