కరోనా తెచ్చిన కష్టాలు..ఇండియన్‌ అథ్లెట్‌ ద్యుతి చంద్‌ కీలక నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు నాలుగు నెలల పాటు క్రీడాలోకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇండియన్‌ అథ్లెట్‌ ద్యుతి చంద్‌ శిక్షణ ఖర్చులు తీర్చేందుకు విలువైన బీఎం‌డబ్ల్యూ కారును అమ్మేందుకు సిద్ధపడ్డారు.

టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో‌ ద్యుతి చంద్‌ నిధుల కొరతతో సతమతమవుతున్నారు. దీంతో ఆమె శిక్షణ ఖర్చుల కోసం తన కారును అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. శిక్షణ ఖర్చులు తీర్చేందుకు బీఎం‌డబ్ల్యూ కారును సోషల్‌ మీడియాలో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని ద్యుతినే శనివారం ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ‘ఇప్పటివరకు శిక్షణ చాలా బాగుంది. నేను భువనేశ్వర్‌లో శిక్షణ పొందుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, స్పాన్సర్లు ఇచ్చిన నిధులన్నీ కోచింగ్‌కు ఖర్చు చేశా. అందుకే నా లగ్జరీ బీఎం‌డబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నా. ఎవరైనా కొనాలనుకుంటే నన్ను మెసేంజర్‌లో సంప్రదించండి’ అంటూ కారుకు చెందిన ఫోటోలను పోస్టులో పెట్టారు.