పరాయి దేశంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్దరు ఎన్నారైలు మృతి..!!

వాస్తవం ప్రతినిధి : దేశం కాని దేశంలో ఇద్దరు భారతీయులు ప్రాణం విడిచారు. కెనడాలోని వాంకోవ‌ర్‌లో సోమ‌వారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టి ఎదురుగా వ‌స్తున్న ట్ర‌క్కులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్ద‌రు భార‌త యువ‌కులు దుర్మ‌ర‌ణం చెందారు. మృతులను పంజాబ్ రాష్ట్రం మాచివారా పట్టణం, మొహాలికి చెందిన‌వారిగా గుర్తించారు. ఉన్న‌త చ‌దువుల కోసం కెన‌డా వెళ్లిన‌ మాచివారా ప‌ట్ట‌ణానికి చెందిన జియాన్ సింగ్ నామ్‌ధారి(22) త‌న స్నేహితులతో క‌లిసి కారులో వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం బారిన ప‌డ్డారు. వారు ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టి ఎదురుగా వ‌స్తున్న ట్ర‌క్కులోకి దూసుకెళ్లింది. దీంతో జియాన్ సింగ్ అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో జియాన్ కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. తన కుమారుడి మరణంతో కుటుంబం మొత్తం శోక‌సంద్రంలో మునిగిపోయింద‌ని తండ్రి గుర్భాగట్ సింగ్ తెలిపారు.