అమరావతి రైతుల నిరసనకు.. ప్రవా‌సాంధ్రుల మ‌ద్ద‌తు..!

వాస్తవం ప్రతినిధి: అమరావతి ఉద్యమం మరో మైలురాయిని చేరుకుంది.. ఈ పోరు ఏకంగా 200 రోజులకు చేరింది. ఆరు నెలలకుపైగా ఈ ఉద్యమం నిర్విరామంగా సాగుతోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే నినాదాన్ని వినిపిస్తూ రైతులు, మహిళలు, చిన్నారులు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించిన రోజు నుంచి నిద్రాహారాలు మాని దీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో నిరసను తెలియజేస్తున్నారు. అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా 200 సిటీల నుంచి ఎన్నారైలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా ప్రజా రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ మద్దతు తెలిపారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న నిరసనకి కువైట్‌లోని ప్ర‌సాంధ్రులు త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. ఎంతో మంది రైతులు త‌మ భూముల‌ను త్యాగం చేసి రాజధాని నిర్మాణానికి ఇచ్చార‌ని ఈ సంద‌ర్భంగా ఎన్నారైలు గుర్తు చేశారు. అలాంటి అన్న‌దాత త్యాగాల‌ను వృధా చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ రాజ‌ధాని త‌ర‌లింపుకు పూనుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌వాసులు ప్ర‌శ్నించారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని ఉండాల‌ని… మూడు రాజ‌ధానులు అవ‌స‌రం లేద‌ని ప్ర‌వాసాంధ్రులు నినాదించారు. భ‌విష్య‌త్తులో రాజ‌ధాని న‌గ‌రం అభివృద్ది ప‌థంలో న‌డిస్తే భూములు ఇచ్చిన రైతుల బిడ్డ‌ల‌కే కాకుండా యావ‌త్‌ అమ‌రావ‌తి ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ప్ర‌వాసులు పేర్కొన్నారు. క‌నుక గ‌త 200 రోజులుగా రాజధాని కోసం పోరాడుతున్న రైత‌న్న‌ల‌కు త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కువైట్‌లోని ఎన్నారైలు చెప్పారు. ఈ సంద‌ర్భంగా వారు ‘వ‌న్ స్టేట్‌.. వ‌న్ క్యాపిట‌ల్’ అంటూ నినాదించారు.