విదేశాల్లో చిక్కుకున్న ఎన్నారైల కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న స్పైస్ జెట్

వాస్తవం ప్రతినిధి: క‌రోనా లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు స్పైస్ జెట్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొత్తగా మ‌రిన్ని చార్ట‌ర్‌ విమానాలు న‌డప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ చార్ట‌ర్‌ ఫ్లైట్ సేవలు ఆరుగురు ప్రయాణికుల నుంచి 150 మంది ప్రయాణికుల వరకు కూర్చునే సామర్థ్యంతో వివిధ శ్రేణి విమానాలను కలిగి ఉంటుంద‌ని తెలిపింది. ఇదిలా ఉంటే… ఇప్ప‌టికే 200 చార్ట‌ర్ విమాన స‌ర్వీసులు న‌డిపిస్తున్న స్పైస్ జెట్ దాదాపు 30వేల మంది భార‌త ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చింది. వీటిలో ప్ర‌ధానంగా గ‌ల్ఫ్ దేశాల నుంచి ఫ్లైట్ స‌ర్వీసులు ఆప‌రేట్ చేసింది. దీనిలో భాగంగా యూఏఈ నుంచి 111 విమానాల్లో సుమారు 20వేల మంది ఎన్నారైల‌ను భార‌త్‌కు త‌ర‌లించింది.