జగన్ ఆ నాయకుడి నిబద్దతను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు,అనుసరిస్తున్న పంథాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా తప్పు పట్టారు. ఆవ భూముల కొనుగోలు,నిమ్మగడ్డ వ్యవహారం,బడ్జెట్ తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆలోచనా దృష్టి ఎప్పుడూ ప్రజల పైనే ఉండాలి తప్ప.. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడం వంటి చర్యలకు స్వస్తి పలకాలన్నారు. ఇందుకోసం ఆయన నెల్సన్ మండేలా జీవిత చరిత్ర నుంచి ఒక ఉదాహరణను వివరించారు.

మండేలా కథ చెప్పిన ఉండవల్లి…

ఇటీవల ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం తాను విన్నానని ఉండవల్లి పేర్కొన్నారు. ఆ ప్రసంగంలో బుగ్గన ఓ విషయాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. సీఎం జగన్ వద్దకు వెళ్లి రెవెన్యూ లోటు గురించి ప్రస్తావించినప్పుడు… నెల్సన్ మండేలా నిబద్దతను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన చెప్పినట్టుగా స్వయంగా బుగ్గన తన ప్రసంగంలో చెప్పారన్నారు. ఇక్కడ తాను మరో విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నానని చెప్పారు. నెల్సన్ మండేలా తెల్లవాళ్లపై పోరులో 27 ఏళ్లు జైలు జీవితం అనుభవించాడన్నారు. అదేమీ వైఎస్ జగన్మోహన్ రెడ్డినో లేక అప్పట్లో గాంధీయో,చార్లెస్ శోభరాజో అనుభవించినట్టు కాదన్నారు. ఆ 27 ఏళ్ళు ప్రతీరోజూ ఆయన్ను జైల్లో చితకబాదేవారని చెప్పారు.

మండేలా ముఖంపై మూత్రం పోసిన జైలర్…

జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో.. అక్కడి జైలర్లకు కోపమొస్తే మండేలాను తీసుకెళ్లి గోతులు తవ్వించేవారని ఉండవల్లి చెప్పారు. ఒకవేళ తవ్వి తవ్వి అలసిపోయి దాహమేస్తుందని చెబితే… ముఖంపై మూత్రం పోసేవారని పేర్కొన్నారు. అన్ని కష్టాలు ఎదుర్కొన్న మండేలా.. చివరకు తన పోరాటం ఫలించి,తాను సౌతాఫ్రికా అధ్యక్షుడయ్యాక… ఓరోజు ఓ హోటల్లో సమావేశానికి వెళ్లారని గుర్తుచేశారు. లోపలికి వెళ్లగానే అందరకీ నమస్కారాలు చేసుకుంటూ వెళ్లి కుర్చీలో కూర్చున్న మండేలా… తన ఎదురుగా,చుట్టుపక్కల ఉన్నవారిని పట్టించుకోకుండా… ఆ హాల్లో ఓ మూలన కూర్చున్న పెద్దాయన్ను చూడటం మొదలుపెట్టాడని చెప్పారు. కొద్దిసేపటికి ఆ పెద్దాయన్ను తన వద్దకు తీసుకురావాలని సిబ్బందితో చెప్పాడన్నారు.

మండేలా ఇచ్చిన సందేశం…

ఆ సిబ్బంది అతన్ని తీసుకొచ్చాక… వణుకుతున్న ఆ వృద్దుడిని తన పక్కనే కూర్చోపెట్టుకుని…కడుపు నిండా భోజనం పెట్టించి పంపించాడన్నారు. ఎవరతను అని అక్కడున్నవాళ్లు అడిగితే… ఒకప్పుడు జైల్లో నా ముఖంపై మూత్రం పోసిన వ్యక్తి అని బదులిచ్చాడన్నారు. అంటే,తాను అధికారంలోకి వచ్చింది తనను ఇబ్బందులను గురిచేసినవాళ్లపై పగ,ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని… ఇప్పుడు తనకు అందరూ సమానమే అనే సందేశాన్ని ఆయన పంపించారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్సన్ మండేలాకు సంబంధించిన ఈ కథను కూడా తెలుసుకుని ఆచరించాలన్నారు.

ప్రజలే కనిపించాలి.. ప్రతిపక్షం కాదు…

ఎస్ఈసీ హోదాలో నిమ్మగడ్డ రమేష్ బాబు ప్రభుత్వాన్ని సంప్రదించుకుండా ఎన్నికలు రద్దు చేయడం తప్పేనన్నారు ఉండవల్లి. అయితే అంతమాత్రానికి ఆయన్ను హడావుడిగా పదవి నుంచి తప్పించి… కొత్తగా మరొకరిని తీసుకొచ్చి నియమించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఎస్ఈసీ కలెక్టర్లు,ఎస్పీలకు ఆదేశాలిచ్చి పని చేయించగలడని… అంతమాత్రాన ఆ ఇద్దరూ ముఖ్యమంత్రి ఆదేశాలకు విరుద్దంగా వ్యవహరించరు కదా అని లాజిక్ పాయింట్ చెప్పారు. ప్రజలు అత్యంత భారీ మెజారిటీ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రి అంత అభద్రతా భావంలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అల్టీమేట్‌గా ఇప్పుడు స్కూళ్లు,కాలేజీలు,థియేటర్స్ అన్ని బంద్ అయ్యాయి అంటే… నిమ్మగడ్డ చేసింది సరైందేనని తేలినట్టే కదా అన్నారు.అర్జునుడు విల్లు చెట్టు వైపు గురిపెడితే… అతనికి పిట్ట కన్ను మాత్రమే కనిపించిందని… అలా జగన్‌కు ప్రజలు మాత్రమే కనిపించాలి తప్ప ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు కాదన్నారు.

అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు…

ఈసారి బడ్జెట్‌ను పరిశీలిస్తే… కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల అమలు,గ్రామ సచివాలయాలు,వలంటీర్ల జీతాలకే రూ.84216కోట్లు ఖర్చు అవుతున్నాయని చెప్పారు. ఓవైపు కేంద్రం నుంచి డబ్బులు రాని పరిస్థితి… మరోవైపు రాష్ట్రాల ఆదాయం పడిపోయింది… ఇలాంటి తరుణంలో ఇవన్నీ ఎలా అమలుచేస్తారని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ ఖర్చుకు సంబంధించిన ఆదాయం ఏ రూపంలో వస్తుందో ఎక్కడా పేర్కొనలేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు అబద్దాలు చెప్పవద్దని… సత్యం దాచవద్దని అన్నారు. చేస్తానని చెప్పి చేయకపోతే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఆవ భూముల కొనుగోలుపై విచారణకు డిమాండ్…

రాజమండ్రిలో ఆవ భూముల కొనుగోలుపై విచారణ జరిపించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానని, గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం తనను పట్టించుకోలేదని అన్నారు. రూ.45 లక్షలు పెట్టి ఆవ భూములు కొనుగోలు చేశారని, వాటికి అంత రేటు ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. పేదలకు పంచి పెట్టడానికి అదే ధరకు ఎక్కడ భూములు ఇచ్చినా కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించారన్నారు. నిబంధనల ప్రకారమే ఆవ భూముల కొనుగోలు జరిగిందని, ఒకే చోట ల్యాండ్ దొరికింది కనుకే త్రీ పర్సెంట్ మాత్రమే అధికంగా చెల్లించామని ఆర్థికశాఖ మంత్రి చెప్పారని ఉండవల్లి తెలిపారు. అయితే ఏ రూల్ ప్రకారం చూసినా అంత డబ్బు ఇవ్వటానికి కుదరదన్నారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ దానిమీద ఎంత పెంచొచ్చు అనేది 2013 యాక్ట్ లో చాలా క్లారిటీగా ఉందన్నారు. మరి వీళ్లు ఏ రకంగా ధర పెంచారో తనకు అర్థం కాలేదన్నారు.