ఆ వ్యవహారంలో బీజేపీ హస్తం కూడా ఉందా..??

వాస్తవం ప్రతినిధి : తమిళనాడు రాజకీయాలు ఎన్నికలకు ముం దే హాట్-హాట్ గా మారుతున్నాయి. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీలు ఇక్కడ నామమాత్రమే. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేలు తమిళనాడును శాసిస్తున్నాయి. అయతే వచ్చే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందన్నది వాస్తవమంటున్నారు పలువురు తమిళ తంబీలు. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా.. మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా నడుస్తుంది.

బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలులో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా, ఇప్పటికే రెండున్నరేళ్ల శిక్ష పూర్తయింది. అయితే ఆమె సత్ప్రవర్తన మీద విడుదల అవుతున్నారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో తమిళనాడులో శశికళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. గత కొంతకాలంగా శశికళ విడుదలవుతుందన్న ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సీన్ లోకి బీజేపీ నేత ఆశీర్వాదం ఆచారి ఎంటర్ అయ్యారు. బీజేపీ నేత ఆశీర్వాదం ఆచారి శశికళ ఆగస్టు నెల 14వ తేదీన విడుదలవుతారని ట్వీట్ చేశారు.

తాజాగా బీజేపీ నేత చేసిన ట్వీట్ తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీంతో మరోవైపు శశికళ విడుదల వెనక బీజేపీ హస్తం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఏడాది ముందు శశికళను బయటకు తెచ్చి అన్నాడీఎంకేను బలోపేతం చేయాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను కూడా ఒప్పంచి అన్నాడీఎంకేను ఒక్కటిగా చేస్తే తమిళనాడులో ఆ పార్టీ కూటమి విజయం సాధించే వీలుందన్న అంచనా ఉంది. అందుకోసమే శశికళను ఏడాది ముందు బయటకు తీసుకువస్తున్నారని చెబుతున్నారు.