పీవీపీ కి హైకోర్టులో ఊరట!

వాస్తవం ప్రతినిధి: వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్‌(పీవీపీ)పై ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని ఆయన దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఓ వ్యక్తి ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుల విషయంలో ఆయనకు ఈ రోజు హైకోర్టులో ఊరట లభించింది.

ఈ కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేయగా, దానిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.