ట్రంప్‌ను అత్యంత ప్రమాదకారిగా అభివర్ణిస్తూ త్వరలో పుస్త‌కం విడుదల

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఆయ‌న‌ సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్ అసక్తికర విషయాలను వెల్ల‌డించారు. ట్రంప్ గురించి ఆమె ‘టూ మ‌చ్ అండ్ నెవ‌ర్ ఎన‌ఫ్‌: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ వ‌రల్డ్ మోస్ట్ డేంజ‌ర‌స్ మెన్’ పుస్త‌కాన్ని రాశారు. పుస్తకం పేరులోనే ట్రంప్‌ను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఇందులో తమ కుటుంబ వివాదాలను పేర్కొన్నారు. స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వారిపై 6 నెలల పాటు అధ్యయనం నిర్వహించిన తర్వాత మేరీ ట్రంప్‌ ఈ పుస్తక రచనకు పూనుకోవడం విశేషం. మ‌ర‌ణించిన త‌న తండ్రి జూనియ‌ర్ ఫ్రెడ్‌, డొనాల్డ్ ట్రంప్ మ‌ధ్య ఉన్న హానిక‌ర సంబంధ‌ బాంధ‌వ్యాలను ఆమె పుస్త‌కంలో రాసుకొచ్చారు. ఇదిలా ఉండ‌గా ఈ పుస్త‌కం వ‌చ్చే నెల మార్కెట్లో విడుద‌ల కానుంది. ఇక‌ ఈ పుస‌క్తం విడుద‌ల‌ను అడ్డుకోవాల‌ని ట్రంప్ సోద‌రుడు రాబ‌ర్ట్ కోర్టును ఆశ్ర‌యించారు. కేవ‌లం త‌న సొంత లాభం కోస‌మే ఇన్నేళ్ల త‌ర్వాత ఆమె పుస్త‌క ర‌చ‌న‌కు పూనుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై న్యూయార్క్ స్టేట్ సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని రాబ‌ర్ట్ త‌ర‌పు న్యాయ‌వాది పేర్కొన్నారు.