అమెరికా అధ్యక్షుడిపై అరెస్ట్‌ వారంట్‌ జారీ

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది. తమ టాప్ కమాండర్ ఖాసిం సులేమాని హత్యకు సంబంధించి ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు సహకరించాలని ఇంటర్ పోల్ ను కోరింది. కనీసం రెడ్ నోటీసునైనా జారీ చేయాలని విన్నవించింది. టెహరాన్‌ అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికాను ట్రంప్‌ ఉపసంహరించుకున్నప్పటి నుంచి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పెరిగాయి. జనవరి మూడో తేదీన బాగ్దాద్‌లో జనరల్ ఖాసిం సొలైమనిని చంపిన ఘటనలో ట్రంప్‌తోపాటు మరో 30 మందికి పైగా వ్యక్తుల ప్రమేయం ఉన్నదని టెహరాన్‌ ప్రాసిక్యూటర్ అలీ అల్కాసిమెహర్ అన్నారు. ట్రంప్‌ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ఆయన ప్రాసిక్యూషన్‌ను ఇరాన్‌ కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ అంశంపై స్పందించేందుకు ఇంటర్ పోల్ చీఫ్ లియోన్ నిరాకరించారు.