విశాఖలో మరోసారి గ్యాస్ లీకేజి దుర్ఘటన..ఇద్దరు మృతి!

వాస్తవం ప్రతినిధి: విషవాయువు లీకేజీతో విశాఖపట్టణం మరోమారు ఉలిక్కిపడింది. ఈసారి పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిందీ ఘటన. గత రాత్రి 11:30 గంటల సమయంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతి చెందిన వారిని కేజీఎచ్‌కు కంపెనీ ప్రతినిధులు తరలించారు. ప్రమాదం రాత్రి 11:30 కు జరిగితే కంపెనీ సిబ్బంది మూడు గంటల తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద చేరడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.