అమెరికా రక్షణ శాఖతో రాజ్‌నాధ్ చర్చలు!

వాస్తవం ప్రతినిధి: గల్వాన్‌ లోయలో చైనా సైన్యం భారత్‌లోకి 423మీటర్లు చొచ్చుకుని వచ్చినట్లు ఉపగ్రహాల చిత్రాల ద్వారా వెల్లడవుతోంది. 1960లో చైనా పేర్కొన్న సరిహద్దు రేఖను దాటి 423మీటర్ల మేర ఆ దేశం దురాక్రమణకు పాల్పడింది. ఆ దేశంతో భారత్‌ మంగళవారం కమాండర్‌ స్థాయి చర్చలు జరపనుంది.
మరోవైపు చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్‌తో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ రోజు సాయంత్రం ఫోనులో చర్చించనున్నారు. తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారత్‌, చైనా మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం.

ప్రాంతీయ భద్రత, సహకారం, సమన్వయం వంటి అంశాలపై వారు కీలక చర్చలు జరపనున్నారు. గాల్వన్‌ లోయ వద్ద చైనా సైన్యం కొన్ని మీటర్ల మేర చొచ్చుకుని వచ్చిందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరుపుతోంది.