ఏపీలో మరో గ్యాస్ లీక్ ఘటన..స్పందించిన సీ ఎం జగన్ !

వాస్తవం ప్రతినిధి: లాక్ డౌన్ టైం లో విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి రిలీజ్ అయిన డేంజరస్ గ్యాస్ వల్ల దాదాపు 12 మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇలాంటి తరుణంలో మరొక గ్యాస్ లీకేజ్ ఘటన జరగడం బట్టి చూస్తే ఏపీ ప్రభుత్వం సరైన బాధ్యతలు నిర్వర్తించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే ఎపిలో ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత ఇప్పుడు అదే విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన జరిగింది. పరవాడ పార్మా సిటీ సాయినాద్ కెమికల్స్ సంస్థలో రియాక్టర్ నుంచి విష వాయువు లీక్ అవడంతో ఇద్దరు మరణించగా, మరో నలుగురు అస్వస్థతకు గురి అయ్యారు. మృతులను షిఫ్ట్‌ ఇంచార్జ్‌ నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైనవారిని గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్‌ విననయ్‌చంద్‌, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తుస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్ ఈ సమాచారం తెలిసిన తర్వాత జిల్లా అదికారులకు పోన్ చేసి వివరాలు తీసుకుని, బాదితులకు మంచి చికిత్స చేయించాలని ఆదేశించారు. ఒక గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన తర్వాత కూడా మరో ఘటన విశాఖలో జరగటంతో విశాఖ వాసులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.