వైసీపీ నేత దారుణ హత్య!

వాస్తవం ప్రతినిధి: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యాడు. భాస్కరరావు మునిసిపల్ చేపల మార్కెట్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. దాడిలో గాయపడిన భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భాస్కరరావు మరణవార్త తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్‌గా పని చేశాడు.

కాగా.. భాస్కర్‌రావు హత్యతో మచిలీపట్నం పోలీసులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిపైకి భాస్కర్‌రావు అనుచరులు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.