సీ ఎం కార్యాలయానికి కరోనా సెగ..హోం క్వారంటైన్‌ లో ముఖ్యమంత్రి !

వాస్తవం ప్రతినిధి: దేశవ్యాప్తంగా రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికై ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తమ పనులను ప్రారంభిస్తున్నాయి. మరోవైపు మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది.

తాజాగా పుదుచ్చేరిలో సీఎం కార్యాలయానికి వైరస్ సెగ తగిలింది. సీఎం నారాయణ స్వామి కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగికి ఇటీవల పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో సీ ఎం కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వెంటనే అతన్ని ఐసోలేషన్‌కు తరలించారు. కార్యాలయంలో శానిటైజేషన్ పనులు చేపట్టారు.

కాగా ఆ ఉద్యోగి ఇటీవల సీఎంను కూడా పలుమార్లు కలిసినట్లు తేలడంతో ఆయన ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఉద్యోగులతో సమావేశాలు, ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. ఉద్యోగులను కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికే కరోనా సెగ తగడంలో ఉద్యోగాలకు రావాలంటేనే చాలా మంది భయపడిపోతున్నారు.