ఆ విషయంలో జగన్ సర్కార్ తెర వెనక భారీ కసరత్తు చేస్తుందా..?

వాస్తవం ప్రతినిధి: విశాఖకు రాజధాని రావడం ఖాయమని వైసీపీ నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు. అయితే అదంత సులువు కాదని తాము అడ్డుకున్నామని మరో వైపు టీడీపీ నేతలు అంటున్నారు. రాజధాని తరలింపు విషయంలో జగన్ సర్కార్ తెర వెనక భారీ కసరత్తు చేస్తూనే ఉంది. దానికి సంబంధించిన పనులను దగ్గరుండి మరీ ఎంపీ విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. విజయదశమి వేళ విశాఖకు రాజధానిని తరలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అప్పటికి కరోనా మహమ్మారి దూకుడు తగ్గుతుందని భావిస్తున్న ప్రభుత్వం దసరా రోజున విశాఖలో పాలనారాజధానిగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం విశాఖలో భ‌వనాల ఎంపిక కూడా పూర్తి అయిందని పలువురు అంటున్నారు. అసెంబ్లీలో రెండవమారు అధికార వికేంద్రీకరణ బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శాసనమండలిలో దాన్ని పక్కన పెట్టినా జూలై 17 నాటికి నెల పూర్తి అయితే ఆటోమేటిక్ గా అది ఆమోదం పొందినట్లేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ తరువాత గవర్నర్ కి బిల్లు పంపించి చట్టంగా తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచన చేస్తోందట.

ఇవన్నీ ఇలా ఉండగా కొత్త విద్యా సంవత్సరం ఆగస్ట్ నుంచి మొదలు కాబోతోంది. అక్టోబర్లో సచివాలయం తరలిస్తే పిల్లలతో బదిలీలకు ఉద్యోగులు సహకరిస్తారా అన్నది మరో వర్గం నుండి వినిపిస్తున్న మాట. మరోవైపు జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు విజయదశమి కల్లా కరోనా పరిస్ధితిలు సర్దుకుంటాయి అని చెప్పలేం అంటూ పలువురు అంటున్నారు. మరి జగన్ అనుకున్నట్లు విజయదశమి కి రాజధాని తరలిస్తారా..? లేదా కరోనా ముందు ఏం చెయ్యలేక వెనకడుగు వేస్తారా..? తెలియాలి అంటే మరో నాలుగు నెలలు ఆగాల్సిందే.