చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..కశ్మీర్‌ ప్రజలకు కీలక ఆదేశాలు!

వాస్తవం ప్రతినిధి: చైనాతో అమీతుమీ తేల్చుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందా? అందుకు సిద్ధంగా ఉండాలని కాశ్మీర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందా? తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం..

కశ్మీర్‌ లోయలో రెండు నెలలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ చేసి పెట్టుకోవాలని చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల విభాగం డైరెక్టర్‌ జూన్‌ 27న ఆదేశాలు జారీ చేశారు. వీటిని అత్యవసరమైన ఆదేశాలుగా పేర్కొన్నారు.

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇవ్వడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్‌ లోయలో కొండ చరియలు విరిగిపడుతుండడంతో జాతీయ రహదారులను మూసివేయాల్సి ఉంటుందని, అందుకే గ్యాస్‌ సిలిండర్లను నిల్వ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వర్షా కాలంలో ఇలాంటి ఆదేశాలు సాధారణమేనంటున్నాయి.