ఆ హత్యలు చేసింది ముఖ్యమంత్రే..అంటున్న కమల్ !

వాస్తవం ప్రతినిధి: తమిళనాడులో ఓ చిన్న మొబైల్ షాపు న‌డుపుకునే ఇద్ద‌రు తండ్రీ కొడుకుల్ని లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో అరెస్టు చేసిన పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేశారు.ఈ దారుణ ఘటనలో సీఎం ప‌ళ‌నిస్వామి ప్రధాన నిందితుడుని ఆరోపిస్తున్నారు నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ . ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాద్యత వహించాలని డిమాండ్ చేశారు. వివరాల ప్రకారం..

త‌మిళ‌నాడు తూతుకూడి జిల్లా శ‌తాంకులంలో ఫెనిక్స్‌(31) చిన్న మొబైల్ షాపు న‌డుపుతుంటాడు. జూన్ 19వ తేదీ సాయంత్రం 8.15 వ‌ర‌కు షాపు తెరిచే ఉంచ‌డంతో పెట్రోలింగ్ పోలీసు ఫెనిక్స్‌‌ను బ‌య‌ట‌కు లాగాడు. ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య‌ వివాదం జ‌రిగింది. ఆ మ‌ర్నాడు షాపుకు వ‌చ్చిన పోలీసులు ఫెనిక్స్‌ తండ్రి జ‌య‌రాజ్‌తో వాద‌న‌కు దిగారు. అత‌డిని స్టేష‌న్‌కి తీసుకెళ్లారు. విష‌యం తెలుసుకున్న ఫెనిక్స్ పోలీస్ స్టేష‌న్‌కి ప‌రుగుపెట్టాడు. అక్క‌డే అత‌డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్ద‌రిపై ఐపీసీ 188 (ప్ర‌భుత్వ అధికారి ఆదేశాల‌ను బేకాత‌రు చేయ‌డం), 353 (ప్ర‌భుత్వ అధికారి విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డం), 269 (ప్ర‌మాద‌క‌ర వ్యాది సంక్ర‌మ‌ణ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం), 506(2) బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం లాంటి సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. పోలీసు క‌స్ట‌డీలో జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌‌ల‌ను పోలీసులు తీవ్రంగా హింసించి చంపడం తీవ్ర కలకలం రేపింది.

ఈ దారుణంపై స్పందించిన కమల్ హాసన్ ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ‘తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. పోలీసుల చర్యకు మద్దతు పలుకుతున్నారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. పోలీసులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వం ఉగ్రవాదానికి అనుమతి ఇస్తోంది’ అని కమల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్‌ కాపర్‌ పరిశ్రమను మూసేయాలంటూ 2018లో నిరసన తెలిపిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను చంపిన ఘటనను కూడా కమల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.