సీ ఎం సమయం ఇస్తే సవివరంగా వివరిస్తానంటున్న రఘురామకృష్ణంరాజు

వాస్తవం ప్రతినిధి: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. రాజ్‌ నాథ్ సింగ్‌ తో రఘురామకృష్ణంరాజు భేటీ అరగంట పాటు సాగింది. వైసీపీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన తరుణంలో రఘురామ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసులు చెల్లవని వాదిస్తున్న ఎంపీ…నిన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఈసీని కలిసి దీనిపై మాట్లాడారు. ఇవాళ ఆయన మరోసారి ఈసీని కలవనున్నారు. ఇక తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన షోకాజ్ నోటీసును వీలైతే ఉపసంహరించుకోవాలని, ముఖ్యమంత్రితో తనకు మరింత భేదాభిప్రాయాలను సృష్టించ వద్దని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి ని కలిసేందుకు అప్పాయింట్మెంట్ ఇవ్వాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశానన్న ఆయన, ముఖ్యమంత్రి సమయం ఇస్తే సవివరంగా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తానని అన్నారు. ముఖ్యమంత్రి నాకు సమయం ఇవ్వకపోయునా, పోస్ట్ లో నా సమాధానాన్ని పంపుతానని అన్నారు.

షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలా…లేదా జరిగిన పరిణామాలన్నింటీనీ ముఖ్యమంత్రి కి సవివరంగా పూర్తి సమాచారాన్ని ఇవ్వాలా అనే అంశాన్ని న్యాయవాదులతో సంప్రదిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రక్షణ కావాలని కోరుతూ గతంలో స్పీకర్ కు లేఖ రాశానని, అదే విషయంపై స్పీకర్ ను నిన్న రాత్రి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశానని అన్నారు.

తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తని, పార్లమెంటు సభ్యుడిని అని రఘురామ చెప్పారు. పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా తాను ఎన్నడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తన గురించి ఎంపీ విజయసాయిరెడ్డి తన మీడియాలో, సోషల్ మీడియా, సామాజికవర్గానికి చెందిన గ్రూపుల్లో తప్పుడు, దొంగ రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. నన్ను పార్లమెంటు సభ్యత్వం నుంచి వాలంటరీగా వెళ్లిపోయినట్టు చిత్రీకరించాలని ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. షోకాజ్ నోటీసులో ఏముంది? రిప్లయ్ ఇవ్వాలా? లేక ఏం జరిగిందో వివరణాత్మకంగా సీఎం జగన్ కి తెలియజేయాలా? అనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు రఘురామ తెలిపారు. అసలేం జరిగింది అనేదాని గురించి పార్టీ అధ్యక్షుడు జగన్ కి తెలియజేస్తానని రఘురామ వెల్లడించారు.