ఏపీ కష్టాలు పడుతోంది: నిర్మలా సీతారామన్

వాస్తవం ప్రతినిధి: కరప్షన్, కుటుంబం, కులం లాంటి రాజకీయాల్లో చిక్కుకుని ఏపీ కష్టాలు పడుతోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుగోడలుగా వైఎస్సార్సీపీ ,తెలుగుదేశం పార్టీల పాలన మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.ఎన్డీయే – 2 పాలన ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మూడో “జన-సంవేద్ వర్చువల్ ర్యాలీని ” శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ర్యాలీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని మోదీ. 2.0 ప్రభుత్వ విజయాలపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షిస్తూ బీజేపీ లక్షల కోట్ల నిధులిచ్చిందని పలు ప్రాజెక్టులు అమలుచేస్తోందని రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీలు అనుసరిస్తున్న కుల తత్వ అవినీతి వారసత్వ కుహనా లౌకిక వాదం వంటి విధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగోడలుగా నిలిచాయని వాటిని ధ్వంసం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం భారతీయ జనతా పార్టీ వలనే సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలను రద్దు చేయడంపై నిర్మల మాట్లాడుతూ.. ఏడీబీలాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తీసుకుని చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాల అమలులో ఇబ్బంది కలిగిస్తే అవి పూర్తికావడం చాలా కష్టమన్నారు. కారణాలు ఏవైనా ఒప్పందాలను రద్దు చేసినట్టు ప్రకటిస్తే దేశానికి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలని నిర్మల సూచించారు. పెడధోరణులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఊరూరా పోరాడాలని పిలుపునిచ్చారు.