చైనా కు చెక్ పెట్టనున్న అమెరికా..భారత్‌కు అమెరికన్‌ బలగాలు

వాస్తవం ప్రతినిధి: భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. చైనా సైన్యంతో ఇండియాకు ప్రమాదం పొంచివుందని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియాతో పాటు మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర ఆసియా దేశాలకు ముప్పు ఉందని అన్నారు. బ్రజెల్స్‌ ఫోరం 2020ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా సైన్యాన్ని నిలువరించేందుకు పలు దేశాలలో ఆర్మీని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నాం. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయా దేశాలకు మద్దతిచ్చేలా ఆలోచిస్తున్నాం. ఈ విషయమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు సమీక్షలు నిర్వహిస్తున్నాం అని మైక్ పాంపియో వెల్లడించారు. ఏ ప్రాంతానికినా ముప్పు ఎదురైతే ఇతర దేశాలు బాధ్యత తీసుకుని వారిని రక్షించాల్సిన అవసరం ఉందని, ఈ అంశాలపై ఐరోపా దేశాలతో పాటు తమ భాగస్వాములందరితో సంప్రదింపులు జరుపుతామని పాంపియో పేర్కొన్నారు.