ఇంత రాద్ధాంతం చెయ్యడానికి అసలు అక్కడ ఏముంది..??

వాస్తవం ప్రతినిధి: ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌గా ఉన్న వ్య‌వ‌హారంలో ఇప్పుడు ప్ర‌భుత్వం చేతికి స‌రికొత్త అస్త్రం ల‌భించడంతో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. స‌రిగ్గా ప‌ది రోజుల క్రితం నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌, బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి, మ‌రో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ హైద‌రాబాద్ హోట‌ల్‌లో భేటీ అయిన సీసీటీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు రావ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఈ నెల 13న నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌, సుజ‌నా చౌద‌రి, కామినేని శ్రీనివాస్ పార్క్ హ‌యత్ హోట‌ల్‌లో భేటీ అయ్యార‌ని చెబుతున్న ఓ సీసీ టీవీ ఫుటేజ్ ప‌ది రోజుల త‌ర్వాత అనూహ్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న నిమ్మ‌గ‌డ్డ ఇలా హోట‌ల్‌లో రూంలో ర‌హ‌స్యంగా రాజ‌కీయ నేత‌ల‌ను కల‌వ‌డం వెనుక కుట్ర ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ముందు నుంచి మేము చెప్పుతున్నట్లే.. నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ చంద్ర‌బాబు నాయుడు మ‌నిషి అని, ఆయ‌న ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ టోన్ పెంచి బల్ల గుద్ది మరీ చెబుతుంది. నిజానికి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ క‌లిసింది బీజేపీ నేత‌ల‌నే అయినా, చంద్ర‌బాబు, టీడీపీ పాత్ర కూడా ఇందులో ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

అయితే, ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ సైలెంట్ గా ఉంటే సరిపోయేది. కాని నోరు తెరిచి టీడీపీ సెల్ప్ గోల్ వేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. నిమ్మగడ్డ మ్యాటర్ లో టీడీపీ భుజాలు త‌డుముకుంది. నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌ను వెన‌కేసుకొచ్చింది. ఈ భేటీ త‌ప్పు కాద‌ని స‌మ‌ర్థించింది. దీంతో త‌మ‌కు సంబంధం లేని వ్య‌వ‌హారంలో టీడీపీ అన‌వ‌స‌రంగా తల దూర్చి అనవసరంగా తలనోప్పి క్రియేట్ చేసుకున్నట్లైంది.దీంతో వైసీపీకి టీడీపీనే అవ‌కాశం క‌ల్పించిన‌ట్ల‌యింది. మొత్తంగా సీసీటీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు రావ‌డంతో టీడీపీ, బీజేపీతో పాటు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌కు కూడా ఇబ్బందులు మొద‌ల‌య్యాయి అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరికొంత మంది సామాన్యులు అయితే మాత్రం అసలు అక్కడు ఏముంది, ఎందుకు ఇంత రాద్ధాంత చేస్తున్నారు, టీవీలో డిబెట్ లు పెట్టుకుంటూ అదే గోల అంటూ మండిపడుతున్నారు.