ఆ ముగ్గురికి ప్రముఖ యాంకర్ ఛాలెంజ్..!

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఉదయభాను.. ఆదివాం జూబ్లీహిల్స్‌లోని ఓ పార్కులో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. “నాకు కూడా పకృతి అంటే చాలా ఇష్టం. అందుకే నా ఇద్దరు కూతుళ్లకు భూమి, ఆరాధ్య అని పేర్లు పెట్టుకున్నాను. ఒకప్పుడు మొక్కలు పెంచండి పెంచండి అని ప్రజలను బతిమలాడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మాకు మొక్కలు ఇవ్వండి ఇవ్వండి అనే చైతన్య వచ్చింది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నినాదం, పట్టుదల వల్లే సాధ్యపడింది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని సంతోష్ గారు కీసరగుట్ట పరిధిలో అడవి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. మీరందరూ చేతనైనంత వరకు చెట్లను పెంచండి” అంటూ తెలిపారు.

కాగా, తాను స్వీకరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరో ముగ్గురికి ఆమె విసిరారు. నటి రేణు దేశాయ్, దర్శకుడు సంపత్ నంది, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంలను ఈ ఛాలెంజ్‌కు ఉదయభాను నామినేట్ చేశారు. ఈ ముగ్గురూ తన ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని ఆమె కోరారు