ఐపీఎల్ షురూ.. షెడ్యూల్ సిద్దం చేసిన బీసీసీఐ!

వాస్తవం ప్రతినిధి: కరోనా కారణంగా వాయిదా పడ్డా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్.. కరోనా వైరస్ కారణంగా వాయిదాపడే అవకాశం ఉండటంతో.. ఆ విండోలో ఐపీఎల్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ప్రాథమికంగా ఓ షెడ్యూల్‌ని రూపొందించిన బీసీసీఐ.. ఆతిథ్య వేదికలపై కసరత్తులు చేస్తున్నట్లు ముంబై మిర్రర్ వెబ్ సైట్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేసిన బీసీసీఐ.. వేదికలపై మాత్రం కసరత్తు చేస్తోందని తెలిపింది. ముఖ్యంగా హోటల్స్ దగ్గరగా ఉన్న స్టేడియాల జాబితాని పరిశీలిస్తోందని రాసుకొచ్చింది.