చైనా ప్రొడక్ట్స్ ని బాయ్ కాట్ చెయ్యండి..??

వాస్తవం ప్రతినిధి: ఇండియా మరియు చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సరిహద్దు వివాదంలో మొదటి దశ చర్చలు సఫలమైన తర్వాత, రెండో దశ చర్చలు మొదలు అవకముందు చైనా కుయుక్తితో భారత్ సైనికులను చంపేసింది. ఇండియా – చైనా సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంటనే అలర్ట్ అయ్యి అత్యవసర సమావేశం ఇండియన్ ఆర్మీ పెద్దలతో నిర్వహించారు. ఆ తర్వాత మోడీతో ఈ విషయం గురించి చర్చించారు. ఇదిలా ఉండగా భారత సైనికులను చైనా చంపేయడం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి. ఈ విషయం నడుస్తూ ఉండగానే చైనా సైనికులు చేసిన దాడికి ప్రతిగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది. మ‌ర‌ణించిన సైనికుల‌కు నివాళిగా ప్ర‌భుత్వం చేప‌ట్టే టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలు పాల్గొన‌కుండా నిషేధం విధించాల‌ని జాగరణ్ మంచ్ కోరింది. దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించింది. ఎస్‌జేఎమ్ కో క‌న్వీన‌ర్ అశ్వ‌ని మ‌హాజ‌న్ మాట్లాడుతూ.. న‌టీన‌టులు, క్రికెట‌ర్లు, ఇత‌ర సెల‌బ్రిటీలు సైతం చైనా ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించ‌రాదని సూచించారు.