టీడీపీ కి వైసీపీ చెక్!..ఈ సారి మామూలుగా లేదండోయ్!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరుగుతున్న పరిణామాలతో చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరొ 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల ఆ పార్టీ దూరమైన ఎమ్మెల్యే మద్దాలి గిరి మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మద్దాలి గిరి కొన్ని రోజుల క్రితం సీఎం జగన్‌ను కలిశారు. అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సందర్బంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. టీడీపీలో ఏం జరుగుతుందో అసలు చంద్రబాబునాయుడు తెలుసుకోలేకపోతున్నారని చెప్పారు. భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పిన చంద్రబాబు… 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారని చెప్పారు. కనీసం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ముగ్గురు పార్టీకి దూరమయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇక మిగిలిన 20 మందిలో కూడా 10 మంది పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని మద్దాలి గిరి చెప్పడం సంచలనంగా మారింది. వైసీపీ ఏడాది పాలన పూర్తి చేసుకొన్న సమయంలో మంత్రి కొడాలి నాని ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష పదవి కూడా కొన్నిరోజుల్లో పోవడం ఖాయమన్నారు. అంటే, ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి లాగి చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తున్నట్టు తెలుస్తోంది.