బీజేపీ జాతీయ కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపిన సింగపూర్ ఎన్నారై లు

వాస్తవం ప్రతినిధి: కోవిద్-19 కారణంగా 2 నెలలకు పైగా సింగపూర్‌లో చిక్కుకు పోయిన తెలుగు, తమిళనాడు మరియు కేరళ వారి కష్టాలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దృష్టికి వెళ్లాయి. వెంటనే స్పందించిన రామ్ మాధవ్ విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌ పూరీతో మాట్లాడారు. అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అదనపు విమానాలను సిద్దం చేశామని రామ్ మాధవ్ సింగపూర్ తెలుగు ప్రతినిధులకు తెలిపారు. వాస్తవానికి సింగపూర్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం వందేభారత్ మిషన్ లో చాలా దక్షిణాది పట్టణాలకు ముఖ్యంగా చెన్నై, విజయవాడ, కొచ్చికి ఎలాంటి పౌర విమాన సర్వీస్‌లు లేకపోవడంతో దక్షిణాది వారు ఇబ్బందులు పడ్డారు. సమస్యను పరిష్కరించేందుకు సింగపూర్‌లోని తెలుగు ప్రతినిధి రత్నకుమార్ రామ్ మాధవ్‌ను సంప్రదించి సమస్య పరిష్కారంలో చొరవ చూపారు. సత్వరమే స్పందించిన రామ్ మాధవ్‌కు రత్నకుమార్ ధన్యవాదాలు తెలిపారు.