శ్రీకాకుళం వాసికి అమెరికాలో అరుదైన గౌరవం!

వాస్తవం ప్రతినిధి: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అసోం కేడర్‌ 1993 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి రవి కోత అమెరికాలోని వాషింగ్టన్‌లో గల భారత రాయబార కార్యాలయంలో ఎకనామిక్‌ మినిస్టర్ గా నియమితులయ్యారు. కోత రవి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామం. రైతు కుటుంబానికి చెందిన ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఏజీ బీఎస్సీ, ఏజీ ఎమ్మెస్సీ చేశారు. న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆగ్రోనమీలో పీహెచ్‌డీ చేశారు. తొలుత ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన ఆయన రెండో ప్రయత్నంలో 1992లో ఐఏఎస్‌ పరీక్షలో 48వ ర్యాంకు తెచ్చుకున్నారు. 1993 బ్యాచ్‌ అసోం కేడర్‌ అధికారిగా ఐఏఎస్‌ ప్రస్థానం ప్రారంభించారు.

అస్సాం ప్రభుత్వంలో ఫైనాన్స్‌ కార్యదర్శిగా, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అసోంలో అర్బన్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో మునిసిపల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ఫైనాన్స్‌ సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2007-08 కాలంలో ఆంధ్రప్రదేశ్‌, పాండిచ్చేరి, అండమాన్‌ ప్రాంతాలకు భారత ఆహార సంస్థ సీనియర్‌ రెసిడెన్షియల్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా, అగ్రరాజ్యం భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా నియమితులయ్యారు. తెలుగు వ్యక్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కిందంటూ జిల్లావాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.