ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించే కన్నా..ఇలా చేయడం బెటర్ అంటున్న వసీమ్‌ అక్రమ్‌

వాస్తవం ప్రతినిధి: అభిమానులు లేకుండా టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించడం అస్సలు ఊహించకోలేనని పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ వసీమ్‌ అక్రమ్‌ అభిప్రాయపడ్డాడు. ఖాళీ స్టేడి యాల్లో మ్యాచులు నిర్వహించే కన్నా.. కరోనా వైరస్‌ తగ్గినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం మేలని సూచన చేశాడు. ది న్యూస్‌తో అక్రమ్‌ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా మంచి ఆలోచన కాదని తన భావన అని, అభిమానులు లేకుండా టీ20 ప్రపంచ కప్‌ ఎలా నిర్వహిస్తారని అన్నారు. మెగా టోర్నీ అంటేనే భారీ జన సందోహం ఉంటుందని, తమ జట్లకు మద్దతు ఇచ్చేందుకు అనేక దేశాల నుంచి ప్రేక్షకులు వస్తారని తెలిపారు. అదొక ప్రత్యేక వాతావరణం అని, ఖాళీ స్టేడియాల్లో అది సాధ్యం కాదని, అందుకే ఐసీసీ కొన్ని రోజులు వేచి చూడాలని, వైరస్‌ తగ్గుముఖం పట్టని పక్షంలో టోర్నీని వాయిదా వేయాలని సూచించాడు.