రాజు ఎక్కడున్నా రాజే.. అదరగొట్టేశాడు కోహ్లీ..!

వాస్తవం ప్రతినిధి: ఫార్మాట్ ఏదైనా క్రీజులోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇక లక్ష్య ఛేదనలో అయితే మరింత ధాటిగా ఆడుతాడు. ఛేదనలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి సైతం సాధ్యంకాని రికార్డులని నెలకొల్పాడు. దీంతోనే భారత్‌తో పాటు ప్రపంచం మొత్తంలో అతనికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అతడు ఎవరో కాదండి మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానులు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సోషల్ మీడియాలో కోహ్లీని అనుసరించేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి రికార్డుల రారాజు, చేజింగ్ కింగ్ అనే బిరుదులు ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజు ఎక్కడున్నా రాజే అని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి రుజువు చేశాడు. మూడు నెలలుగా క్రికెట్‌ మ్యాచ్‌లు లేక ఇంటికే పరిమితమైనప్పటికీ.. సామాజిక మాధ్యమాల అర్జనలో విరాట్‌ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

మార్చి 12 నుంచి మే 14 వరకు సోషల్‌ మీడియా అర్జన వివరాలను ఓ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ గడువులో ఇన్‌స్టాగ్రామ్‌లో 3 ఫొటోలు పోస్ట్‌ చేసిన విరాట్‌.. అక్షరాల మూడు కోట్ల 62 లక్షలు మూటగట్టుకున్నాడు. అంటే అతడు పోస్ట్‌ చేసిన ప్రతి ఫొటోకు రూ. 1. 20 కోట్లు సంపాదించాడన్న మాట. లాక్‌డౌన్‌ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల ద్వారా అత్యధికంగా సంపాదించిన టాప్‌-10 క్రీడాకారుల జాబితాలో కోహ్లీ ఆరోస్థానంలో నిలిచాడు. టాప్‌-10లో ఉన్న ఏకైక క్రికెటర్‌ కోహ్లీనే కావడం గమనార్హం.