ఈ నెల మూడో వారంలో- రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు  

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారైనట్టు తెలుస్తోంది.వారం రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరించి శాసనసభను ఎలా నిర్వహించాలనే అంశంపై శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 19న పోలింగ్‌కు ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నందువల్ల ఆ రోజుకు అటూఇటుగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడంపై చర్చించారు.

ఈనెల మూడోవారంలో అనగా ఈ నెల 13 లేదా 16న సమావేశాలను ప్రారంభించటంపై తొలుత చర్చ జరిగింది. 19వ తేదీ నుంచే ప్రారంభిస్తే 26 వరకు కొనసాగించవచ్చన్న ప్రతిపాదనపై కూడా చర్చించారు.

కచ్చితమైన తేదీని నేడో రేపో ప్రకటిస్తారు. శాసనసభ వ్యవహారాలు, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ శ్రీనివాసులు తదితరులు ముఖ్య మంత్రితో సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ 19న ఉన్నందున ఆ రోజుతో కలిపి సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు