కౌంట్ డౌన్ స్టార్ట్… పచ్చ పార్టీ నేతలు గోల గోల?

వాస్తవం ప్రతినిధి: ప్రతి పేదవాడి సొంతింటి కలను తప్పక నెరవేరుస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి దాదాపు రంగం సిద్ధం చేసారు. తొలి విడత ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జులై 8న వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు . ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్న సీఎం.. వారి కేటాయించిన స్థలం వద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలన్నారు సీఎం. పేదవాడికి నిర్మిస్తున్న ఇళ్లల్లో అన్ని నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. గవర్నమెంట్ ఇచ్చే ఇళ్లు అంటే నాసిరకం అనే భావన పొగొట్టి.. నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్నందున.. అయా కాలనీల్లో మౌలిక సదుపాయాలకల్పనపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఉగాది నాటికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు స్థలాల సేకరణ ఓ కొలిక్కి వచ్చింది, ఇక పట్టాలు పంచడమే తరువాయి. ఇలా అంతే ఓకే అనుకుంటున్న టైమ్ లో టీడీపీ నేతలంతా ఇళ్ల స్థలాలపై రచ్చ చేస్తున్నారు. ఈ స్థలాల సేకరణలో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల సీజేఎఫ్ఎస్ భూములు లాక్కున్నారని, ఎస్సీ-ఎస్టీల నుంచి భూములు స్వాధీనం చేసుకుంటున్నారని, రాజధాని భూములను పేదలకిస్తున్నారని గోల గోల చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ టైమ్ దగ్గరపడుతుండే సరికి టీడీపీ నేతల్లో ఇలా అసహనం అమాంతం పెరిగిపోతోంది. చంద్రబాబు సైతం ఈ వ్యవహారంపై ఎప్పుడూ లేనంత గొడవ చేస్తున్నారు. అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.

అయితే దీని పై కొందరు టీడీపీకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. జగన్ మెండి వాడు ఎట్టి పరిస్ధితులోను అనుకున్నది అనుకున్నట్లు చేసేస్తాడు. ఈ ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చేస్తాడు. లక్షలమందికి పట్టాల పంపిణీ జరిగితే.. టీడీపీకి అది రాజకీయ సమాధి లాంటిదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ అమలు చేస్తున్న నవరత్నాలలో ప్రతి కుటుంబానికీ అత్యంత ఎక్కువగా లబ్ధి చేకూర్చేది ఈ పథకమే. అంటే ప్రతి లబ్ధిదారుడు, వారి కుటుంబం.. జీవితాంతం జగన్ కు రుణపడి ఉంటారు. ఇంకెముంది వాళ్లు బ్రతికి ఉన్నంత కాలం, ఆ తరువాత తరతరాల కాలం జగన్ కే ఓటు వేసి గెలిపించి ఆ రుణం తీర్చుకుంటారు. అందుకే ఇళ్ల పట్టాల పంపిణి ఎలాగైన అడ్డుకోవాలి అని ఛంద్రబాబు అండ్ కో చూస్తున్నారు అని ప్రధానంగా వినిపిస్తున్న మాట.