ఇప్పటికే రూ.500కోట్లు దోచుకొన్నారు..చాలదా?

వాస్తవం ప్రతినిధి: ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడినఆయన పేదలకు ఇళ్ల స్థలాల పథకం వైకాపా నేతలకు ఆర్థిక ఫలాల పథకంగా మారిందని వ్యాఖ్యానించారు. దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారిని బెదిరించి ఏకపక్షంగా భూములు లాక్కుని ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఇళ్ల స్థలాలకు భూ సేకరణ పేరుతో రూ.లక్షలు విలువచేసే భూములను రూ.కోట్లు విలువ చేసే భూములుగా చూపించి దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఇప్పటికే రాష్ట్రంలో రూ.500కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో వైకాపా నేతలు రూ.10కోట్లకుపైనే దండుకుంటున్నారని కళా వెంకట్రావు మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. రూ.25 లక్షల విలువ చేసే.. నివాసయోగ్యం కాని భూమికి రూ.55 లక్షలు చిల్లించారంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు.