గాంధీ విగ్రహం ధ్వంసం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవాస భారతీయుడు

వాస్తవం ప్రతినిధి: వాషింగ్టన్ డి.సి లో ఇండియన్ ఎంబసీకి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని దౌర్జన్యకారులు ధ్వంసం చేయడాన్ని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను, గాంధేయవాదులను తీవ్రంగా కలచి వేసిందన్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొని ఉన్న జాతివివక్షత నిరసనకు, ఈ ధ్వంసానికి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటన ఒక అనాగరిక, పాశవిక చర్య అని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన మొదటిది కాదని, గతంలో అనేక పర్యాయాలు ఇటువంటి ఘటనలు సంభవించాయన్నారు. ఫ్రికన్ అమెరికన్ల ఆగ్రహానికి, ఆవేదనకు, నిరసనకు అర్థం ఉందని, తప్పనిసరిగా అందరూ మద్దతు పలకాలని ఆయన అన్నారు. అయితే ఏ ఉద్దేశంతో ఈ ఆందోళన ప్రారంభించారో, గత పది రోజులుగా జరుగుతున్న ఈ దౌర్జన్యాలు, దహనకాండ, ధ్వంసంతో ఆ ఆశయం పక్కమార్గం పట్టి దహనాలు, దోపిడీలు, విధ్వంసాలకు దారి తీయడం శోచనీయం అన్నారు.