పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న టీమిండియా క్రికెటర్..!

వాస్తవం ప్రతినిధి: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్‌ గర్భవతి అని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్ చేశాడు. ‘తనతో జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నా. ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు.

ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌తో క్రికెటర్ హార్దిక్‌ పాండ్య కొంత కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అతి త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు.

హర్దిక్‌ పోస్ట్‌కు స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రీతో పాటు పలువురు క్రికెటర్లు‌ వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.