మహాప్రభో ఆదుకోండి!..రేపు హస్తినకు పయనమవుతున్న జగన్!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు కీలక సమాచారం.

ఢిల్లీ లో ప్రధాని మోదీ తో పాటు గా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షాతో జగన్ చర్చించనున్నారు. రాష్ట్రంలో వైరస్ పరిస్థితి రాష్ట్రానికి సంబంధించి ఇతర ఆర్థిక పరమైన అంశాలను కూడా అమిత్ షా ముందు ప్రస్తావించనున్నట్లు సమాచారం. అమిత్ షా తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు అధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.

ప్రధానంగా ఆయన కేంద్ర మంత్రులతో ఆర్థిక అంశాలపైనే మాట్లాడనున్నట్లు సమాచారం. వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు నష్టపోయిన విషయాలను ఆయన వివరించనున్నట్లు సమాచారం. అలాగే ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న పలు రాజకీయ పరిణామాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్టు తెలుస్తుంది.