చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్..నింగిలోకి వ్యోమగాములు

వాస్తవం ప్రతినిధి: అంతరిక్ష ప్రయోగాల్లో స్పేస్ ఎక్స్ కొత్త రికార్డును ఆవిష్కరించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన చరిత్రాత్మక స్పేస్ ఎక్స్ క్య్రూ డ్రాగన్ మిషన్ సక్సెస్ అయింది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్‌ స్టేషన్‌ నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్‌ ఎక్స్‌ రూపొందించిన ఈ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా డగ్లస్ హర్లీ మరియు రాబర్ట్ బెంకెన్‌ అంతరిక్షంలోకి ప్రయాణమయ్యారు. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత వీరు ఐఎస్‌ఎస్‌కు చేరుకోనున్నారు. ఈ ప్రయోగంపై స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పలువురు అధికారులతో కలిసి ఈ ప్రయోగాన్ని వీక్షించారు. దేశ చరిత్రలో ఈ రోజు గొప్పగా నిలిచిపోతుందన్నారు. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషాల్లో వాయిదా పడిన సంగతి తెలిసిందే.