త్వరలో ఓ తీపి కబురు చెబుతా..అది విని దేశమే ఆశ్చర్యపోతుంది అంటున్న గులాబీ బాస్

వాస్తవం ప్రతినిధి: త్వరలోనే రైతన్నలకు ఎన్నడూ వినని తీపి వార్త చెబుతానని, ఇది విని దేశమే ఆశ్చర్యపోతుందని, ప్రపంచంలోనే రైతులకు ఎక్కడా ఇటువంటి శుభవార్త చెప్పి ఉండరని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వ్యవసాయదారులపై ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా ఎఫ్ సీఐ ధాన్యం సేకరణలో తెలంగాణ నుంచే 63 శాతం ధాన్యం ఉండడం గర్వకారణమని అన్నారు.

ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో కలిసి మర్కుక్ పంప్ హౌస్ వద్ద కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు మోటార్లు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ కల సాకారమైందని, రాష్ట్ర చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఓ ఉజ్వల ఘట్టం అని పేర్కొన్నారు. వందల మీటర్ల ఎత్తుకు నీటిని పంపించడం అనేది తమాషా అయిన విషయం కాదని స్పష్టం చేశారు.

అయితే ప్రాజెక్టులను గాల్లో కట్టలేము కాబట్టి, కొన్ని గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడవచ్చని తెలిపారు. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు రూపుదిద్దుకుందని, వారిపట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంటుందని చెప్పారు. నిర్వాసితుల త్యాగాలకు వెలకట్టలేమని, నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వారికి పనిచేతకాదని విమర్శలు చేసేవారికి తమ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తిరుగులేని సమాధానం ఇచ్చారని కేసీఆర్ వివరించారు.