పరాయి దేశంలో పాడు పని.. అడ్డంగా బుక్కయిన ఇద్దరు ఇండియన్స్

వాస్తవం ప్రతినిధి: ఇతర దేశాలకు వెళ్లి అక్కడ మనదేశం గర్వపడేలా కొందరు చేస్తుంటే.. మరికొందరు మాత్రం పరాయి దేశంలో పాడు పనిచేసి దేశానికి అప్రతిష్టను మూటగడుతున్నారు. అక్రమంగా డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు యూకేలో 34 ఏళ్ల జైలుశిక్ష పడింది. గతేడాది డిసెంబరు 11న బాల్దేవ్ సింగ్ అనే భారతీయుడు డ్రగ్స్ ఉన్న వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఈ సమయంలో వాహనంలో మొత్తంగా 168 కేజీల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాల్దేవ్ సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆల్డ్స్ ట్రేడింగ్ ఎస్టేట్ పార్క్‌లో రెండో రైడ్ జరపగా మరో నాలుగు కేజీల కొకైన్ దొరికింది. ఈ రైడ్‌లో పోలీసులు శక్తి గుప్తాను అరెస్ట్ చేశారు. యూకేలో ఇంత మొత్తంలో డ్రగ్స్‌ దొరకడం ఇదే మొదటిసారి అని డిటెక్టివ్ సూపర్ఇంటెండెంట్ నీల్ బల్లార్డ్ తెలిపారు. అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతూ రాగా.. తాజాగా కోర్టు తీర్పునిచ్చింది. శక్తి గుప్తాకు 18 ఏళ్లు.. బాల్దేవ్ సింగ్‌కు 16 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పిచ్చారు.