వలస కూలీల కోసం వంటవాడిగా అవతారమెత్తిన వీరేంద్ర సెహ్వాగ్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. సజీవమైన గుండెను పిడికిట పిసికినట్టు గత రెండున్నర నెలలుగా బాధపెడుతున్న వలస కూలీల గాథలకు చలించిపోయాడు. కరోనా తెచ్చిన కష్టంతో ఊరుబాట పట్టిన వలస కూలీల కోసం వంటవాడిగా అవతారమెత్తాడు.

తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల సహకారంతో స్వయంగా తానే వంట చేసి.. ఆ ఆహారాన్ని ప్యాక్ చేసి ఓ స్వచ్చంద సంస్థ ద్వారా ఆకలితో ఆలమటిస్తున్న వలస కూలీలకు అందజేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ డాషింగ్ ఓపెనర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాకుండా కరోనాతో అల్లాడుతున్న అభాగ్యులకు అండగా నిలిచేందుకు సాయం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.