లక్ష కోట్లు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది అంటున్న చంద్రబాబు..!!

వాస్తవం ప్రతినిధి: మహానాడులో రెండవ రోజు చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి తారా స్థాయికి చేరుకొన్నది అని అన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైన్స్‌ సహా దేనినీ వైసీపీ నాయకులు వదిలిపెట్టడం లేదని తీవ్ర స్థాయిలో అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. జలగ మాదిరిగా జగన్ ఈ రాష్ట్రాన్ని పట్టుకుని పిండుకుంటున్నారని ద్వజమెత్తారు. ‘అవినీతి కోసమే కొన్ని స్కీములు తయారు చేశారని ఆరోపించారు. ఈ సమయములో అమరావతి గురించి మాట్లాడుతూ. అమరావతి రాజధాని నిర్మాణం లక్ష కోట్లు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి పై తెలుగుదేశం పోరాటం కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తెలియక విచ్ఛిన్నం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.