కన్నా లక్ష్మీనారాయణ చిన్న కోడలు అనుమానాస్పద మృతి

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కోడలు నల్లపురెడ్డి సుహారిక రెడ్డి(32) మృతి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆమె ఆకస్మిక మరణానికి కారణం ఏమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుహారిక ఆత్మహత్య చేసుకోలేదని.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక అసలు నిజం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
అందుతున్న వివరాల ప్రకారం హైదరాబాద్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్ లోని స్నేహితురాలి నివాసంలో ఈ సాయంత్రం ఆమె స్పృహ తప్పి పడిపోయారని చెపుతున్నారు. మరోవైపు ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఘటన జరిగిన వెంటనే ఆమెను రాయదుర్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు.

అయితే, ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.