సీఎం కేసీఆర్‌ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు: హరీష్‌ రావు

వాస్తవం ప్రతినిధి: కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో సీఎం కేసీఆర్‌ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు మంత్రి హరీష్‌ రావు. సాగు, తాగునీటి సమస్యకు ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం చూపెడుతుందని తెలిపారు. వందల కిలోమీటర్ల దూరంలో పారే గోదావరిని 618 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజెక్టులో చివరి దశ కొండపోచమ్మ ప్రాజెక్టు అన్నారు. ప్రారంభోత్సవానికి సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్తు ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లను ఆహ్వానించినట్లు తెలిపారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన నాయకులను పరిమిత సంఖ్యలో ఆహ్వానించామన్నారు. పండగ వాతావరణంలో లక్షలాది మందితో నిర్వహించాలనుకున్నా లాక్‌డౌన్‌ వల్ల సాదాసీదాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహ్వానితులే కార్యక్రమానికి హాజరుకావాలని, ప్రజలు ఎవరూ రావొద్దని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.