‘మంచు కొండల్లోని చంద్రమా…’ అంటూ ఉదయించిన కవి చంద్రుని సినీ సాహిత్య సౌరభానికి ఇరవై ఐదు వసంతాలు నిండాయి. తెలుగు భాష తియ్యదనం గురించి చెప్పాలన్నా, పంచదార బొమ్మ ని వర్ణించాలన్నా, అమ్మ రుణం తీర్చుకోవాలనుకొన్నా, ప్రేయసి అందాన్ని నిర్వచించాలన్నా ఆయన కలానికి వెన్నతో పెట్టిన విద్య . ప్రేమ గీతమైనా, స్పూర్తిదాయకమైన గీతమైనా ఆ కలం పలికించే తీరే వేరు. ఎటువంటి పాటనైనా వ్రాయ గలరు అని నిరూపించుకొన్న ఓ విశిష్ట గేయ రచయిత, ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ గారు. ఆయన పాటల ప్రయాణం మొదలై 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్బంగా చంద్రబోస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ..
చంద్రబోస్ గారి సాహిత్యం అందరికీ సులువుగా అర్ధం అవుతూ ఆయన భావ ప్రపంచంలోకి శ్రోతలను తేలిగ్గా తీసుకొని వెళ్లగలుగుతుంది. ఆయన పాటల్లో నే కాదు ఆయన మాటల్లో కూడా విన సొంపైన తెలుగు సాహిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన పాట రాసిన తొలి చిత్రం ‘తాజ్‌మహల్’. ఆ సినిమాలో డా.సి.నారాయణరెడ్డితో కలిసి పాటలు పంచుకుంటూ, ‘మంచు కొండల్లోని చంద్రమా…’ అంటూ మొదలైన ఆయన పాటల ప్రయాణం నేటికీ విజయవంతంగా సాగుతూ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఆయనకి ఒక స్టార్ రచయితగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
మూడు వేలకి పైగా పాటలు రాసిన ఈ సినీ గేయ కారుడి గీతాలు పాత కాలానికి నేటి నవతరానికి మధ్య అంతరాలని చెరిపేస్తుంటాయి. “మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందీ… (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్)”, “నీ నవ్వుల తెల్లదనాన్ని నాగ మల్లి అప్పడిగిందీ… (ఆది), ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం… (స్టూడెంట్ నెంబర్ 1), పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ… (నాని) … ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో మధురమైన పాటల్ని అందించిన మధుర కవి శ్రీ చంద్రబోస్. బాల్యం..
తన సాహిత్యంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సాహిత్య ప్రియుల అభిమానాన్ని చూరగొన్న చంద్రబోస్ ది వరంగల్ జిల్లాలోని చిన్న గరిగ అనే చిన్న పల్లెటూరు. తండ్రి నరసయ్య, తల్లి మదనమ్మ. మే 10న జన్మించిన చంద్రబోస్‌తో సహా నరసయ్య దంపతులకు నలుగురు పిల్లలు. ప్రాధమిక పాఠశాలలో పనిచేసే నరసయ్య తెచ్చే ఆదాయం చాలక కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపొతే… తల్లి మదనమ్మ కూడా కూలీపనికి వెళ్లి వేన్నీళ్లకు చన్నీళ్లుగా కొంత సొమ్ము ఇంటికి తెచ్చేది. అప్పట్లో అనుభవించిన కష్టాలే తన జీవిత సౌధానికి సోపానాలయ్యాయని చంద్రబోస్ తరచూ సన్నిహితులతో చెప్తుంటారు. బాధలు పడనివారికి సుఖపడే అర్హత లేదని ఆయన అంటారు. కష్టాలే బతుకు అర్ధాన్ని విడమరచి చెప్తాయని ఆయన అభిప్రాయం.
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశారు చంద్రబోస్. పాటల రచయితకన్నా ముందుగా నేపథ్య గాయకుడిగా సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించారు. దూరదర్శన్‌లో సైతం పాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలోనే ఆయన స్నేహితులు ఒకరు పాటల రచయితగా ప్రయత్నించమని సూచించడంతో చంద్రబోస్ దశ తిరిగింది. 1995లో ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ‘తాజ్ మహల్’ చిత్రం కోసం శ్రీలేఖ సంగీత దర్శకత్వంలో ‘‘మంచు కొండల్లోని చంద్రమా ….” అన్న పాటతో చంద్రబోస్ సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో అక్కడి నుండి చంద్రబోస్ గారి సినీయానం ప్రారంభమైందని చెప్పవచ్చు.
ఇంచుమించు అగ్ర దర్శకులందరి దగ్గర చంద్రబోస్ పనిచేసారు. అగ్ర హీరోలయిన చిరంజీవి, నాగార్జున, వేంకటేశ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ లకు ఎన్నో పాటలు రాసారు. తొలినాళ్లలో చిరంజీవి చిత్రాలు ‘మాస్టర్’, ‘చూడాలని ఉంది’, ‘బావగారు బాగున్నారా’?, ‘ఇద్దరు మిత్రులు’, ‘ఠాగూర్’, ‘అందరివాడు’, ‘జై చిరంజీవ’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కలం సాయం అందించారు. అలాగే మిగిలిన హీరోలకు కూడా ఆయన విజయవంతమైన పాటలు రాసారు. రామ్ చరణ్ తేజ ‘మగధీర’, ‘రంగస్థలం’ చిత్రాల్లోని పాటలు ఎంతటి విజయాన్ని సాధించాయో చెప్పాల్సిన పని లేదు.
అమిత జనాదరణ పొందిన పాటలు :
చంద్రబోస్ అనగానే ఎన్నో పాటలు గుర్తొచ్చినా… కొన్ని కొన్ని పాటలు మాత్రం ఇప్పటికీ జనం నాలికలపై నర్తిస్తూనే ఉన్నాయి.
మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’…చిత్రంలో “సాయినార…సాయినార…”,
నాగార్జున ‘డమరుకం’లో “లాలీ, లాలీ.. జో లాలి…”,
జూనియర్ ఎన్ఠీఆర్ ‘ఆది’ సినిమాలో “నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది…”,
‘షిర్డీ సాయి’ చిత్రంలో “సాయి అంటే తల్లి…”,
‘గబ్బర్ సింగ్’లో “ఆకాశం అమ్మాయి అయితే…”,
‘జుమ్మంది నాద[ం’లో “దేశమంటే మతం కాదు…”,
‘బాలు’ చిత్రంలో ” ఇంతే ఇంతింతే…”,
‘జై చిరంజీవ’ చిత్రంలో “జై గణేశా…”,
‘నాకు నీవు – నీకు నేను’ చిత్రంలో “తెలుగు భాష తీయదనం..”,
‘స్టూడెంట్ నంబర్ 1’లో “ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి…”
లాంటి పాటలు ఇప్పటికీ జనం పాడుకుంటూనే ఉన్నారు.
‘సాంబా’లో నమస్తే, నమస్తే నీకు నమస్తే…,
‘మగధీర’లో “పంచదార బొమ్మ…” ,
‘నేనున్నాను’ లో “చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని…”,
‘నాని’ సినిమాలో “పెదవే పలికే మాటలో తీయని మాటే అమ్మ….”,
‘పల్లకిలో పెళ్లికూతురు’ లో “చీరలో గొప్పతనం తెలుసుకో…”,
‘మృగరాజు’లో “చాయ్ చటుక్కున తాగారా భాయ్…” ,
‘రంగస్థలం’లో “ఈ సేతితోనే…”
ఇలా చెప్పుకుంటూ పొతే లెక్కకు మించిన పాటలు అమిత జనాదరణ పొందాయి.
అవార్డులు..
2002లో ‘పెళ్లి సందడి’ చిత్రానికి రాసిన పాటలకు గాను ఉత్తమ గీత రచయితగా నంది అవార్డుని చంద్రబోస్ అందుకున్నారు. 2004లో ‘ఆది’ సినిమాలో “నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది…” పాటకు, అదే సంవత్సరం ‘నేనున్నాను’ చిత్రంలో “చీకటితో వెలుగే చెప్పెను..” పాటకు నంది అవార్డులు అందుకున్నారు. 2014లో ‘మనం’ చిత్రంలో “కనిపించిన మా అమ్మకు…” అనే పాటకుగాను ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇంకా అనేక సాంస్కృతిక సంస్థల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు.
కుటుంబం ..
చంద్రబోస్ కుటుంబం ఆటపాటలతో ఆహ్లాదకరంగా ఉంటోంది. ప్రముఖ కొరియాగ్రాఫర్ సుచిత్రను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ ఎలా మొదలైందంటే.. ఆయన మాటల్లో..
“1998లో ‘పెళ్లి పీటలు’ సినిమా రికార్డింగ్ కోసం చెన్నై వెళ్లాను. పని పూర్తయ్యాక హైదరాబాద్ వస్తున్నాను. ఆ పాటల్ని షూట్ చేయడానికి కొరియోగ్రాఫర్‌గా సుచిత్ర హైదరాబాద్ వస్తోంది. మేమిద్దరం ఒకే సినిమాకు పని చేస్తున్నాం కాబట్టి ఫ్లయిట్లో పక్కపక్క సీట్లు వచ్చాయి. ‘హలో’ అని ఆమెను పలకరించాను. అప్పటికే విడుదలైన ‘పరదేశీ’ సినిమాలో నేను రాసిన పాటల గురించి చెబుతూ, కొన్ని వాక్యాల గురించి ప్రస్తావించింది.
కొరియోగ్రాఫర్లు విన్యాసాలకు మాత్రమే అనుకుంటున్న తరుణంలో మనసుకు సంబంధించిన సాహిత్యాన్ని కూడా గుర్తుపెట్టుకుని చెప్పడంతో తనంటే నాలో మంచి భావన కలిగింది.
కవితాత్మకంగా చెప్పాలంటే… కవిత్వాన్నే అర్థం చేసుకున్నది, కవిని కూడా అర్థం చేసుకుంటుందని, అర్ధాంగిని చేసుకోవాలనుకున్నాను.
ఫ్లయిట్ ప్రయాణం మరుసటి రోజు నా బర్త్‌డే. మాటల మధ్యలో ఆ విషయం చెప్పాను. మరుసటి రోజు నాకో పుష్పగుచ్చం, గ్రీటింగ్ కార్డ్ పంపింది.” అంటూ చెప్పుకొచ్చారు.
చంద్రబోస్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక కూతురు, ఒక కొడుకు. కూతురి పేరు అమృత వర్షిణి, కొడుకు పేరు నంద వనమాలి.
తాజాగా చంద్రబోస్ కరోనా సమయంలో పోలీసులపై ఒకపాట రాశారు. పోలీసులపై దాడులపై ఓ పాట రాయవల్సిందిగా హైదరాబాద్ సి పి సజ్జనార్ కోరిక మేరకు తాను ఈ పాట రాసానని తెలిపారు చంద్రబోస్. ఈ పాట సోషల్ మీడియాలో పలువురి ప్రశంసలు పొందుతోంది.
చివరగా..
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సాహితీ అభిమానులను కూడగట్టుకుని, సినీ సాహితీ ప్రపంచంలో తార గా వెలుగుతున్న ఈ కవి చంద్రుడు మరెన్నో మధుర మైన గీతావిష్కరణ లు చేయాలని, తర తరాలు మరువలేని అత్భుతమైన పాటలు ఆయన కలం నుంచి జాలువారాలని, మరెన్నో విజయాలు ఆయన అందుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకొంటూ ఈ సందర్భంగా మరొక్క సారి హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతోంది వాస్తవం.
— Prasad Thota