టీటీడి నిర్ణయంపై జనసేనాని ఆగ్రహం.. ప్రశ్నల వర్షం

వాస్తవం ప్రతినిధి: తిరుమలేశునికి వివిధ రాష్ట్రాలలో వున్న ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయంపై రాజకీయ వివాదం రాజుకుంటోంది. బీజేపీ, జనసేన,, సీపీఐ పక్షాలే కాకుండా సామాన్య భక్తజనం టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. తమిళనాడు, రుషికేశ్‌లలో వున్న టీటీడీ ఆస్తుల వేలం ప్రక్రియను ఆపకపోతే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని బీజేపీ, సీపీఐ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన భూముల వేలంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు దేశంలోని అన్ని హిందూ దేవాలయాలు, సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తాయని, ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయాల్లో ఒకటిగా ఉన్న టీటీడీ మంచి పద్ధతులను అనుసరించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.

ఒకవేళ టీటీడీ భూములను అమ్మేస్తే, ఇతర దేవస్థానాలు కూడా ఈ పద్ధతులను పాటించే అవకాశముందని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని ఆయన అన్నారు.

విభజనతో నష్టపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఇప్పటికీ పూర్తి స్థాయి రాజధాని నగరం లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు కావాలని, ఉద్యోగాలను సృష్టించాలని, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవాలని ఆయన అన్నారు.

ఇటువంటి సమయంలో భూములు రెవెన్యూ కోసం ఉపయోగపడతాయని, ప్రభుత్వ భూములను, ఆస్తులను సర్కారు తప్పనిసరిగా కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఇందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. భక్తుల నమ్మకాలు, మనోభావాలు దెబ్బతీయడం, రాష్ట్రంలో భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులను బాగుచేసే అంశాలను కూడా ప్రమాదంలోకి నెట్టితే ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పుగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.