మట్టిలో మాణిక్యాలను గుర్తించే సంగీత స్వరకర్త..!

రైల్లో ఒక అంధుడు పాడినట్లు, ఇంట్లో అమ్మ కూనిరాగాలు తీసినట్లు , వీధుల్లో బిచ్చగాడు గొంతు ఎత్తుకొన్నట్లు పాడితే అలాంటి సామాన్యుల గొంతు వింటే ఫిదా అవుతాడు రఘు కుంచె. బహుశా.. ఆయన వ్యక్తిత్వంలోని ఆ సహజత్వమే పాటసారిగా మార్చిందేమో! లేకపోతే చిరుద్యోగి బేబమ్మ, రైల్లో పాటలు పాడుకొనే అసిరయ్య, ఊళ్లు పట్టుకొని తిరిగే గోవిందరాజుల్ని వెతికి పట్టుకొనే వాడు కాదు. వాళ్లు ఫేమస్ అవుతుంటే కడుపునిండినంత సంబరపడిపోతాడు రఘు. ఆ ప్రయాణం ఎలా మొదలైందంటే..

జానపదాలంటే నా కెంతో ఇష్టం . దీనికి కారణం మా ఊరే. మాది రాజమండ్రి దగ్గర గాదరాడ అనే ఓ కుగ్రామం. బాల్యంలో ఓ చిన్న జానపద ప్రపంచంలో పెరిగాను. బుర్రకథలు, పద్య నాటకాలను ప్రదర్శించే వాళ్ళు. అవన్నీ కళ్లారా తిలకించాను. నిరక్షరాస్యుడు, సంగీతం అంటే తెలియని వ్యక్తి కృష్ణుడి వేషం వేసి హై పిచ్ లో పద్యాలు పాడుతుంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. అంత సమ్మోహనంగా ఎలా పాడుతున్నాడని ఆశ్చర్యంతో చూసేవాణ్ని. భగవంతుడు ఇచ్చిన గాత్రాన్ని వాళ్లు సాధనతో తీర్చి దిద్దుకొన్న తీరు అధ్భుతం. వాళ్ల గాత్రంలో ఓ ఆత్మ ఉంటుంది.

నన్ను చాలా మంది అడిగారు. పలాస 1978 చిత్రంలో జానపద కళాకారులతో పాడించడం కన్నా ప్రొఫెషనల్ సింగర్స్ తో పాడించి ఉంటే చిత్రం ఇంకా బాగా ఆడేదికదా అని. గొప్ప గాయకులతో పాడించి ఉంటే ఖరీదైన సెంటు బాటిల్లోని పరిమళం వచ్చేది. సాధారణ వ్యక్తులతో పాడించడం వల్ల వర్షం లో తడిసిన మట్టి వాసన ఆ పాటలకు వచ్చింది. అందుకే జానపద కళాకారులతో పాడించడానికే ఇష్టపడతా.

ఇందులో రిస్క్ ఉంది, కష్టం ఉంది, అరగంటలో అయిపోయే పాట రికార్డింగ్ కు రోజంతా పట్టవచ్చు. ప్రతిలైనూ మనం దగ్గరుండి పాడించుకోవాలి. కానీ ఇవన్నీ నాకు ఇష్టమే. మట్టిలో దాగున్న ఆ మాణిక్యాలకు అనుకోని గుర్తింపును ఇవ్వాలన్నదే ఆశ. అదో పిచ్చి. అందుకనే వివిధ మాధ్యమాల్లో అన్వేషిస్తుంటా. అలా ఓ మంచి కళాకారుణ్ణి పరిచయం చేసినా నా జీవితం ధన్యమవుతుంది.

ఇందులో ప్రమాదమూ లేకపోలేదు. ఒక్క పాట తో వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ వల్ల వాళ్ల జీవితం ఉక్కిరిబిక్కిరి కావచ్చు. అందుకే బేబమ్మకు, అసురయ్యకు, రాజుకు గట్టిగా ఓ మాట చెప్పాను.” సినిమా ఓ పెద్ద ప్రపంచం, అందులో పైకి రావడం అంత సులువు కాదు. తొలి ప్రయత్నంలోనే మీరు విజయుక్తులయ్యారు . కానీ మీ వృత్తులలో మీరు కొనసాగుతూ ఉండండి.సినిమాలను ప్రవృత్తిగా పెట్టుకోండి అని”.

లర్నింగ్ టైం :

అనుకోకుండా వచ్చిన లాక్ డౌన్ సెలవుల పుణ్యమా అని యూట్యూబ్ లో వీడియోలను ఫాలో అవుతూ ఎడిటింగ్ నేర్చుకొన్నాను. ఫోటొషాప్ లో డిజైనింగ్ , సౌండ్ మిక్సింగ్ లో ప్రోటూల్స్ గురించి తెలుసుకొన్నా. అవసరమే అన్నీ నేర్పిస్తుంది. లాక్ డౌన్లో ఎక్కడివాళ్లు అక్కడ ఉన్నారు కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొన్నాను.

మనకు గుణపాఠం :

ఎన్నో జబ్బులు చూశాం. కానీ ఎక్కడా సామాజిక దూరం పాటించమని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటేనే భయం. ఆ వ్యక్తి దగ్గినా, తుమ్మినా మనకేదో మూడినట్లే అన్న ఆందోళన. సూపర్ మార్కెట్ కి వెళ్లాలంటే గుండెల్లో దడ. ఇలాంటి పరిస్థితి ప్రతిచోటా కనిపిస్తుంది. మీ దగ్గర వంద కోట్లు ఉండవచ్చు కానీ మీరు ఏం చేయగలరు? టైరు పంక్చర్ అయినా బాగుచేసుకోలేని పరిస్థితి. కరోనా అనేది మనందరికీ ఒక గుణపాఠం.

మూడు పనులు చేశా:

లాక్ డౌన్ సమయంలో ఎప్పుడూ గుర్తుండే మూడు ప్రాజెక్టులు పూర్తి చేశా. ” ఎ నైట్ ఇన్ క్వారెంటైన్ ” ఇదొక లఘు చిత్రం. మహమ్మారి, పోలీసన్న పాటలకు యూట్యూబ్ లో మంచి స్పందన వచ్చింది. కరోనా పై అవగాహన కోసం కాస్త వెటకారంతో చేసింది. చెప్పిన మాట వినకుంటే ఓరినాయనా మహమ్మారి పాట. చాలా నిజాయితీగా చేసిన పాట పోలీసన్న. మనం ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తుంటే పోలీసులేమో    మండుటెండలో రోడ్లపై యుద్దం చేస్తున్నారు. వాళ్ల సేవలను గుర్తుచేసుకొనే పాట ఇది.

అసిరయ్య..

పలాస నుంచి వైజాగ్ వరకు ప్యాసింజర్ రైల్లో పాటలు పాడుకొంటూ జీవనం సాగిస్తున్నాడు అసిరయ్య. 40ఏళ్లుగా అదే జీవితం. కూతుళ్లకు పెళ్ళి చేశాడు. కొడుకును బి ఈ డి చదివించాడు. రైల్లో ఆయన పాడుతుంటే వీడియో తీసి ఎవరో వైరల్ చేశారు. దాని ఆధారంగా అసిరయ్యను కలుసుకొన్నాడు రఘు. అతను అరుదైన జముల కళాకారుడు . ఆయనదగ్గర ఉన్న జముకల వాయిద్యం 50 ఏళ్ల నాటిది. వాళ్ల తండ్రి ఇచ్చాడట. దాన్ని ఆయన అలాగే భద్రంగా చూసుకొంటున్నాడు. ” పలాస 1978″ చిత్రం టైటిల్ సాంగ్ లో ఆ వాయిద్యాన్ని వాడాడు.ఆయనకి ‘పలాస అసిరయ్య’ అనే పేరు స్థిరపడింది.

గోవింద రాజులు:

అనంతపురం వాసి గోవింద రాజులు. ఆయన వయస్సు 70 పైచిలుకే. ఊరూరా తిరిగి పద్య నాటకాలను పదిమందికి నేర్పిస్తోన్న మహాను భావుడు. ఆయన దగ్గర ఉన్న హార్మోనియం డెబ్బై ఏళ్ల నాటిది. ఆయన స్వరం ముందు మైకులు బలాదూర్. రఘు తీసిన చిత్రంలో హీరో తండ్రి పద్యాలు పాడుతుంటాడు. అతడి పద్యాలన్నింటినీ గోవిందరాజుల ద్వారా రఘు పాడించడం విశేషం.

షంషాబాద్ రాజు:

ఖలేజా చిత్రం లోని సదాసివా సన్యాసి పాటను రాజు పాడుతుంటే ఎవరో ఫేస్ బుక్ లో పెట్టారు. షంషాబాద్లో నివసించే అతడు అంధుడు. అతడి స్వరం అరుదైనదిగా గుర్తించాడు రఘు. వెంటనే అతడిని హైదరాబాద్ కు పిలిపించి పలాస 1978 టైటిల్ సాంగ్ ఏవూరు ఏవూరే పాట పాడించాడు. చిత్రానికే ఆ పాట హైలేట్ గా నిలిచింది. కారణం రాజు సహజ స్వరం.

బేబమ్మ:

తూర్పు గోదావరికి చెందిన బేబమ్మను రఘుకి పరిచయం చేసింది ఫేస్ బుక్.ఆమె పాడిన ఓ పాటను విని ఫోన్ చేశాడు. కానీ ఆమె సినిమాల్లో పాడటానికి నిరాకరించింది. ఏదో మ్యూజిక్ షో కోసం హైదరాబాద్ వస్తుందని తెలుసుకొని బేబీని మళ్లీ అడిగాడు రఘు. దాంతో ఆమె పాడేందుకు ముందుకు వచ్చింది. మొదట ఆమెతో మట్టి మనిషినండీ నేను అనే పాటను పాడించాడు. ఆ పాటకు యూ ట్యూబ్ లో 40 లక్షల వ్యూస్ వచ్చాయి. సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పలాస చిత్రంలో ఓ సొగసరి డ్యూయెట్ పాడించాడు. సినిమాల్లో తొలిపాటను ఎస్పీ బాలు తో పాడే అవకాశం కొట్టేసింది బేబమ్మ.