బాబు అభ్యర్దనను పెండింగ్ లో పెట్టిన ఏపీ సర్కార్!

వాస్తవం ప్రతినిధి:  మార్చి 20న హైదరాబాద్ కు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను ఏపీకి వెళ్లేందుకు అనుమతించాలని చంద్రబాబు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి లభించింది. ఏపీ సర్కారు మాత్రం దాన్ని పెండింగ్ లో పెట్టింది. తాను హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తానని ఏపీ డీజీపీకి లేఖ రాస్తూ, ఆపై ఆన్ లైన్ లో రెండు రాష్ట్రాల డీజీపీలనూ అనుమతి కోరారు. తెలంగాణ డీజీపీ కార్యాలయం వెంటనే అనుమతి మంజూరు చేయగా, ఏపీ డీజీపీ కార్యాలయం ఇంకా స్పందించలేదు.